Tuesday, February 17, 2009
తక్షణ కర్తవ్యం
పరస్పరం కత్తులు దూసుకోవటం
మల్లగుల్లాలు పగలగొట్టుకోవటం
అవసరమైనన్ని ధృతరాష్ట్ర కౌగిళ్ళలో చిక్కుకుపోవటం
ఒకప్పుడు ఎదురుపడితేనే
పరవశంతో మెరిసిపోయే ముఖమే
విద్వేషాల లోగిళ్ళకు ఆలవాలమవ్వటం
సమకాలీన సందర్భమో
అసంకల్పిత ప్రతీకారమో
మనకి చరిత్ర ఓ మైలు రాయిని పాతేసింది
గొంతులుతడిసాయి
కడుపులు నిండాయా?
ఆకులు ఖాళీగానే మిగిలిపోయాయి
ఆశలు ఆశలుగానే మిగిలిపోవాల్సిందేనా?
సరళీ కృత అధోగతి విధానం
రాజ్యాంగ సమీక్షా ప్రహసనం
ప్రతిభ చొరబాటుని పారద్రోలటానికై
ప్రయివేటు పరమే శరణ్యం!
ఇక జీవితమంతా హైటెక్ టెక్నాలజీలోనే...
క్లోనింగ్, జీనోం లొస్తున్నాయ్
పిచ్చోడి చేతిలో రాయేనా?
మనమధ్య మనకున్న బింకాలింకా సడలనన్నాళ్ళూ
సంకెళ్ళింకా బిగువవుతూనే ఉంటాయ్
కవుల భావజాలాల్లోనే కాదు
కార్య దీక్షా సామర్ద్యంలోనూ
దళిత సమైక్యతా జెండాలెగరెయ్యగలగాలి
" నెత్తుటి పువ్వుల్ని చేసి
నేలలో కూల్చేసినా
బంగారమై బయటికి రావచ్చు
ఆకాశంలోకి విసిరేసినా
వాన చినుకులై ప్రాణం పోయొచ్చు
సముద్రంలోకి తోసేసినా
ముత్యాలై మెరిసిపోవచ్చు "
ఇక మన జెండాలన్నీ
ఏక జెండాలై ఎగరెయ్యటమే మన తక్షణ కర్తవ్యం!
- డా. దార్ల వెంకటెశ్వర రావు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment